‘గరీబ్‌రథ్’లో కొత్త ప్రయాణ అనుభూతి..!
విశాఖ-సికింద్రాబాద్-విశాఖ మధ్య నడిచే గరీబ్‌రథ్ ఎక్స్‌ప్రెస్‌కు కొత్త రూపురేఖలు వచ్చాయి. ఇటీవల ఈ రైలు ఐసీఎఫ్(ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ) నుంచి ఎల్‌హెచ్‌బీ (లింక్ హాఫ్‌మన్ బుష్)కి మారింది. ఎల్‌హెచ్‌బీ బోగీల్లో ఆధునిక సదుపాయాలతో పాటు రెండు సైడ్ బెర్తులు మాత్రమే ఉండటంతో ప్రయాణికులకు కొంత ఉపశమనం కలిగినట్లయింది. గతంలో మూడు సైడ్ బెర్త్‌లు ఉండేవి. మధ్యతరగతి ప్రయాణికులకు దృష్టిలో ఉంచుకొని ఎకానమీ బోగీలను అందుబాటులోకి తీసుకొచ్చారు. ఒక్కో బోగీకి 80 సీట్ల చొప్పున మొత్తం 18 బోగీలకు కలిపి 1440 సీట్లు ఉండటం విశేషం. పాత గరీబ్‌రథ్ కంటే కొత్తదాంట్లో ప్రయాణికులకు అదనంగా 100 సీట్లు అందుబాటులోకి వచ్చాయి. ఛార్జీల ధరల్లో ఎటువంటి మార్పు లేదు. అంతేకాకుండా పరిశుభ్ర టాయిలెట్లతోపాటు అత్యాధునిక డస్ట్‌బిన్, వాష్ బేషిన్‌లు ఏర్పాటు చేయడంతో గరీబ్‌రథ్ రైలు కొత్త ప్రయాణ అనుభూతిని పంచుతోంది.