December 23, 2024

డి లిమిటేషన్ జరిగితే ఎన్ని పార్లమెంటు స్థానాలు పెరగచ్చు.

🔊డీలిమిటేషన్ వైపు కేంద్రం చూపు.. పెరగనున్న అసెంబ్లీ సీట్లు

దేశవ్యాప్తంగా జనగణన చేపట్టేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధమవుతున్నది. వచ్చే ఏడాది ప్రథమార్ధంలో ఈ ప్రక్రియ మొదలుకానున్నదని, పూర్తి రిపోర్టు 2026లో కేంద్రానికి అందనున్నదని కేంద్ర ప్రభుత్వ వర్గాల నుంచి సమాచారం అందింది. దీంతో డీలిమిటేషన్ ఎక్సర్‌సైజ్‌పైనా చర్చలు మొదలయ్యాయి. కేంద్ర ప్రభుత్వం జనాభా లెక్కల ప్రక్రియపై అధికారికంగా ఎలాంటి నిర్ణయం తీసుకోకున్నా, ప్రకటన విడుదల చేయకున్నా ప్రస్తుతం సెన్సస్ కమిషనర్ (రిజిస్ట్రార్ జనరల్ బాధ్యతలు సైతం) మృత్యుంజయ కుమార్ నారాయణ పదవీ కాలాన్ని 2026 వరకు పొడిగిస్తూ నిర్ణయం తీసుకోవడంతో ఈ వార్తలు గుప్పుమన్నాయి. జనగణన ప్రక్రియ 2026 నాటికి పూర్తయితే రాష్ట్రంలో అసెంబ్లీ స్థానాల సంఖ్యను విభజన చట్టం ప్రకారం పెంచడానికి వెసులుబాటు లభిస్తుందని, ఇందుకు అవసరమైన చట్ట సవరణ లేదా రాజ్యాంగ సవరణ జరిగే అవకాశమున్నదని రాజకీయ నాయకులు భావిస్తున్నారు.

తెలంగాణలో 34 అసెంబ్లీ స్థానాలు పెంపు

విభజన చట్టం ప్రకారం రాష్ట్రంలో ఒక్కో లోక్‌సభ స్థానం పరిధిలో రెండు అసెంబ్లీ సీట్లు పెరగాల్సి ఉంటుంది. ఆ ప్రకారం ప్రస్తుతం ఉన్న 119 అసెంబ్లీ సెగ్మెంట్లు 153కు పెరగనున్నాయి. ఆంధ్రప్రదేశ్‌లో సైతం అసెంబ్లీ స్థానాల సంఖ్య 175 నుంచి 225కు పెరగనున్నాయి. విభజన చట్టంలో పేర్కొన్న ప్రకారం 2026 తర్వాత జరిగే తొలి జనాభా లెక్కల అనంతరం తెలంగాణ, ఏపీ రాష్ట్రాల్లో నియోజకవర్గాల పెంపు అమలులోకి వస్తుంది. ఆ ప్రకారం 2034లో జరిగే ఎన్నికల నుంచి వర్తించే చాన్స్ ఉన్నది. కానీ దీనిని సవరణలు చేసి 2026 తర్వాత జరిగే డీలిమిటేషన్ ప్రక్రియతోనే విభజన చట్టంలోని అంశాన్ని సైతం వర్తింపజేయాలని బీఆర్ఎస్ తరఫున అప్పటి ఎంపీగా వినోద్ కుమార్ లోక్‌సభలో డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ తరఫున పార్టీ అధినేత కేసీఆర్ సైతం ప్రధానికి, కేంద్ర హోం మంత్రికి లేఖలు రాశారు. ఈ నేపథ్యంలో వచ్చే సంవత్సరం జరిగే జనాభా లెక్కల తర్వాత డీలిమిటేషన్ జరగడంలోని చట్టబద్ధతపై పార్టీ నేతల మధ్య ఇప్పటికే చర్చలు మొదలయ్యాయి. లోక్‌సభ ఎన్నికలు 2029లో జరగనున్నందున అప్పటికల్లా దేశవ్యాప్తంగా డీలిమిటేషన్ ప్రక్రియను కంప్లీట్ చేయాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తున్నందునా.. దానితో పాటే తెలంగాణలోని అసెంబ్లీ, లోక్‌సభ స్థానాల సంఖ్య పెరుగుతుందనే ఆశలు నెలకొన్నాయి. పార్లమెంటు ఎన్నికల నాటికి డీలిమిటేషన్ పూర్తి చేయడంపై కేంద్రం నిర్ణయం తీసుకుంటే తెలంగాణకు సైతం లబ్ధి కలుగుతుందనే ఆశాభావం వివిధ పార్టీల నేతల్లో వ్యక్తమవుతున్నది.

దేనిని ప్రామాణికంగా తీసుకుంటారు?

డీలిమిటేషన్ ప్రక్రియలో 1971, 2011 జనాభా లెక్కల్లో దేనిని ప్రామాణికంగా తీసుకుంటారనే చర్చ చాలాకాలంగా జరుగుతున్నది. జనాభా నియంత్రణ (ఫ్యామిలీ ప్లానింగ్) ప్రక్రియను దక్షిణాది రాష్ట్రాలు విజయవంతంగా అమలు చేయడంతో తాజా జనాభా లెక్కలను ప్రామాణికంగా తీసుకుంటే లోక్‌సభ సీట్ల సంఖ్య తగ్గుతుందని, దాని వల్ల అన్యాయం జరుగుతుందని ఇప్పటికే బీఆర్ఎస్, డీఎంకే తదితర పార్టీలు కేంద్రానికి వెల్లడించాయి. కుటుంబ నియంత్రణ పాటించని ఉత్తరాది, ఈశాన్య రాష్ట్రాలకు ఎక్కువ ఎంపీ సీట్లు దక్కుతాయనే అభిప్రాయాన్ని ఓపెన్‌గానే వ్యక్తం చేశాయి. ఈ నేపథ్యంలో డీలిమిటేషన్‌కు 2025 జనాభా లెక్కలను పరిగణనలోకి తీసుకున్నా.. అన్యాయం జరుగుతుందనే అభిప్రాయం నెలకొన్నది. దేశవ్యాప్తంగా మొత్తం లోక్‌సభ స్థానాల సంఖ్య ప్రస్తుతం 545 ఉన్నప్పటికీ కొత్త పార్లమెంటు భవనంలో 888 సీట్లను ఏర్పాటు చేశారు. రాజ్యసభలో సైతం 250 స్థానాలకు బదులుగా 384 మంది కూర్చునేలా అరేంజ్‌మెంట్స్ ఉన్నాయి. మొత్తం లోక్‌సభ స్థానాల సంఖ్య 2029 ఎన్నికల నాటికి పెరిగేలా డీలిమిటేషన్ ప్రక్రియను నిర్వహించాలనే ముందుచూపుతోనే బీజేపీ వ్యవహరించిందనే అభిప్రాయామూ అప్పట్లో వ్యక్తమైంది.

డీలిమిటేషన్ తర్వాతే మహిళలకు 33% కేటాయింపు!

మహిళా రిజర్వేషన్ చట్టం ప్రకారం.. అది అమల్లోకి వచ్చిన తర్వాత చేపట్టే మొదటి జనాభా లెక్కల అనంతరం నిర్వహించే పార్లమెంటు ఎన్నికల్లో మహిళలకు 33% స్థానాలను కేటయించాలన్నది సుస్పష్టం. ఏయే నియోజకవర్గాలను మహిళలకు కేటాయించాల్సి ఉంటుందో జనాభా లెక్కలతో నిర్ధారణ కావాల్సి ఉంటుంది. కానీ మహిళలకు 33% స్థానాలు కేటాయించాలంటే ఇప్పుడున్న సీట్లతో సర్దుబాటు చేయడాన్ని పార్టీలు వ్యతిరేకిస్తున్నాయి. ఆ మేరకు సీట్లను పెంచి కేటాయిస్తే ఎలాంటి అభ్యంతరం లేదని ప్రకటించాయి. ఇలాంటి పరిస్థితుల్లో డీలిమిటేషన్ ప్రక్రియతో అన్ని రాష్ట్రాల్లో నియోజకవర్గాల పునర్ వ్యవస్థీకరణ ఖాయమనే భావన నెలకొన్నది. మొత్తం లోక్‌సభ సీట్ల సంఖ్య 888గా కేంద్రం ప్రాథమిక అంచనాకు రావడంతో మొత్తం జనాభాను పరిగణనలోకి తీసుకుని ఒక్కో నియోజకవర్గానికి సగటు లెక్కలు వేసి లోక్‌సభ స్థానాల సంఖ్యను పెంచవచ్చనే అభిప్రాయం వినిపిస్తున్నది.

🛟ఈ అన్ని అభిప్రాయాల నేపథ్యంలో రాష్ట్రంలో ఒకేసారి లోక్‌సభ, అసెంబ్లీ స్థానాల సంఖ్య పెరగవచ్చనే చర్చలు పార్టీల నేతల మధ్య జరుగుతున్నాయి. విభజన చట్టం ప్రకారం సీట్ల సంఖ్యను పెంచాలంటే ఆ చట్టంలోని నిబంధనను సవరించడానికి పార్లమెంటులో బిల్లును ప్రవేశపెట్టి ఆమోదం పొందాలి. వచ్చే ఏడాది జనాభా లెక్కల ప్రక్రియను మొదలుపెట్టి 2026 తర్వాత దేశవ్యాప్తంగానే డీలిమిటేషన్ చేయాలంటే రాజ్యాంగంలోని ఆర్టికల్ 82ను సవరించాలి. దీనికి సైతం పార్లమెంటులో బిల్లు పెట్టడం అనివార్యం. ప్రస్తుతం ఉన్న నిబంధనల ప్రకారం 2026 వరకు డీలిమిటేషన్ ప్రక్రియపై ఆంక్షలు ఉన్నాయి. దీంతో 2026 తర్వాత జరిగే తొలి సెన్సస్ అనంతరమే డీలిమిటేషన్ జరగాల్సి ఉంటుంది. కానీ ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం 2029 లోక్‌సభ ఎన్నికల నాటికే డీలిమిటేషన్ చేయాలని నిర్ణయం తీసుకుని దానికి అనుగుణంగా చట్ట, రాజ్యాంగ సవరణలు చేస్తే విభజన చట్టానికి కూడా అదే ప్రాసెస్‌ను అమలు చేసి తెలంగాణ, ఏపీ రాష్ట్రాల్లోనూ లోక్‌సభ, అసెంబ్లీ సీట్లను పెంచేందుకు మార్గం సుగమం అవుతుంది. అన్ని పార్టీల అభిప్రాయాలను తీసుకునేలా కేంద్ర ప్రభుత్వం ఆల్ పార్టీ మీటింగ్ నిర్వహించవచ్చని ఓ పార్టీ నేత వ్యాఖ్యానించారు.

Related Post